Thursday, August 18, 2016

విపశ్యన ధ్యాన కేంద్రము

విపశ్యన ధ్యాన కేంద్రము (మే 31 )

మనం ఆలోచించడం,రాయడం లాంటివి చెయ్యకండా ,మనదగ్గర కాయితం,పెన్నూ,చదివే పుస్తకాలూ వుంటే తీసేసుకుంటారు.సెల్ ఫోనయితే ముందే తీసేసుకుంటారు.
లోపలి కెల్లడానికి ముందు ఆ గేటు బయట మూసుకున్నపెదవులు సరిగ్గా పది రోజుల తరువాత మళ్లీ అదే గేటు బయట కొచ్చేదాకా తెరవ కూడదు.
తెల్లవారుఝాము నాలుగు గంటలకి లేవాలి ,రోజుకిపది గంటలుధ్యానం,సాత్వికాహారం
ఈ ప్రపంచంతో ఏ సంబంధాలూ ఉండకూడదీ పది రోజులూ........
ఇవీ విపాస్స్యన ధ్యాన కేంద్రం గురించి బయటి వాళ్ళు చెపితే నేను విన్నకొన్నిపొడిమాటలు. మహోన్నతమూ,మహాద్బుతమూ,
ఐన ఆ నిశ్శబ్దాన్నిఅనుభవించడానికి
రేపు తెల్లవారుజామున వెళ్తున్నాను. ఆ లోపలికి......నమస్కారం






కళ్ళు మూసుకుని ఆ ద్యానం లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను.. చిక్కటి దుమ్ముపట్టేసినఅద్దం లాంటి నా మనసులో సీతాకోకచిలకల్లా అటుఇటు కదుల్తున్న జ్ఞాపకాలు,రంగురంగుల కొత్తకోరికలు,చిరాకుపెట్టే మిత్రులు,అందమయిన శత్రువులు ................నిరంతరమైన ట్రాఫిక్,సిగ్నల్ పోల్స్ కనిపించని దారుణమయిన ట్రాఫిక్... ..మస్తిష్కంలో ఇలాగే జరుగుతుందని ‘’మెడిటేషన్’’ అన్న లెక్చర్లో ఓషో అన్నమాటలు గుర్తొస్తున్నాయి.
ఊపిరాడ్డం లేదు
ఒకటే చిరాకు
కళ్ళుతెరిచి కురుస్తున్నఆ వర్షంలోపారిపోదాం అన్న ఆలోచన.
కెరటాల అలజడి,హోరూ కేవలం సముద్రంఒడ్డున మాత్రమే..వాటిని దాటి ఆ సముద్రం మధ్యలోకెళ్తే అంతమనోహరమైన ప్రశాంతత ఇంకే జన్మకీ దొరకదు.అన్నభగవాన్ శ్రీ రమణమహర్షి మాటలు గుర్తొచ్చాయి.
ఈ బల్యారిష్టాల్ని దాటుకుంటా ముందుకి మరీ ముందుకెళ్తే జన్మధన్యమే కదా?అనుకుంటా...ఆ ప్రయత్నమే చేయడం మొదలెట్టాను.ఏమవుతుందో చూద్దాం......... (జూన్  12)

                      



నాగార్జునసాగర్ రోడ్లో వున్న’’విపస్యన’’ ద్యాన కేంద్రంలో పది రోజులుండి బయటి కొచ్చిన నన్ను తీసుకెళ్ళడానికి మిత్రులు చక్రవర్తిగారొచ్చారు.తోటల్లో రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి బయటికొచ్చాక సాగర్ రోడ్ వచ్చింది ..’’సిటీలోకొద్దు నాగార్జునసాగర్ వెళ్దాం’’ ఆన్నాను.
ఆకాశమంతా మబ్బులు పట్టి వుంది .చలి గాలులు వీస్తున్నాయి..ఈ పదిరోజులూ ద్యానంలో వున్ననా మనసు అదోలాగుంది ,అదోరకo మూడ్ క్రియేటవుతుంది..
‘’విపశ్యన అంటే ఏంటoడి?’’అడిగేడు చక్రవర్తిగారు.
‘’ఉన్నది ఉన్నట్టుగా చూడ్డం’’సమాధానం చెపుతా నేచర్నే చూస్తున్న నాకు చూస్తున్నప్రతీదీ అద్భుతంగా కనిపిస్తుంది.అదే మూడ్ లో సాగర్ ఘాట్ లోకి ఎంటరయ్యి,బ్రిడ్జి మీదకొచ్చాo.నారింజ రసం అమ్మేబళ్లవాళ్ళు రమ్మని పిలుస్తున్నారు.మౌలాబి అనే అమ్మాయి బండిలో రసం తాగి ,డేమ్ వేపెళ్తుంటే ‘’సాగర్లో నీళ్ళు లేవు చూడండి... అంతా ఎండి పోయింది.రేపు వర్షాలు వస్తే చాలా బాగుంటుంది తెల్సా’’అంటున్నాడు చక్రవర్తిగారు.
అప్పుడేమో....ఉన్నదున్నట్టుగా చూస్తున్న ప్రతీదీ బాగుందిప్పుడు.
‘’వర్షాలకి బాగానీళ్ళు వచ్చేకా....యీ సాగర్నుంచి శ్రీశైలం బోట్ జర్నీ....అబ్బో..... మీరయితే భళే ఎంజాయ్ చేస్తారు’’
అప్పుడేమో....నాకిప్పుడే చాలా ఆహ్లాదకరంగా ఉంది....ప్రతీదీ అందంగా ఉంది..అసలు అందం కనిపించే దాంట్లో కాడు.ఎవరో అన్నట్టు చూసే మన కళ్ళల్లో వుండాలి.....ఇది కూడా విపస్యనేనా......? కాసేపు ఆలోచించిన నేను,చక్రవర్తి గారి కేసి చూశాను ఏదో పాడుకుంటున్నాడు....... ‘’నీ అందమే అరుదైనది,నా కోసమె నీవున్నది.వెన్నెల ఎండ కాసింది,కన్నుల కాటుక కరిగింది..........(జూన్ 16 )


                   







No comments:

Post a Comment