Thursday, August 18, 2016

సుజాత మెస్

పొద్దుటే మారేడుమిల్లిలో అదేదో చెత్త హోటల్లో నెయ్యిదోశ ,ఇడ్లీలు తిన్నరవి ‘’చెండాలం’’అనరిచేడు. అరవలేదుగానీ మా ఫీలింగ్ కూడా అదే.
‘’చింతూరులో మంచి భోజనం పెట్టిస్తాను పదండి’’అంటా కారుస్టార్ట్ చేశాడు విజయబాబు.
పచ్చాపచ్చని కొండల మధ్య అద్భుతమైన ఘాట్లో హాయిహాయి ప్రయాణం.దారిలో అక్కడక్కడా ఆగుతా ముందు కెళ్తుంటే... ఆ చింతూరు వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం లేని నేను అదోలాగున్నాను.అందుక్కారణం ,మా పాపికొండలు ట్రిప్ కేన్సిలవ్వడo.
ఒంటి గంటకి చింతూరు ఆ సుజాతా మెస్ లో కెళ్ళాం. ఫుడ్డింకా రెడీ అవ్వలేదంట ’’ఇక్కడెలాగుంటదో’’అనుకుంటున్నారవి, చిరాగ్గా అక్కడి బల్ల మీద చతికిల బడితే అతన్నిజేర్చినేనూ కూలబడ్డాను.బయట నిలబడి ఫోను మాటాడు కుoటున్నాడు విజయ్. కరెంట్లేకపోడంతో ఒకటే చెమట్లు,చొక్కాలు తడిసిపోతున్నాయి.మనసంతా చిరాగ్గా అదేదోలాగుంది.లేచెల్లిపోదాం అనుకుంటుండగా’’సార్ భోజనం రడీ అండి’’ అన్న ఆడగొంతు వినిపించింది,ఫ్యాన్లు కూడా తిరగడం మొదలెట్టినియ్యి.
వేడిఅన్నంలో చిన్నచిన్న ఉల్లిపాయ ముక్కలు కలిసిన గోంగూర పచ్చడి .ముద్ద నోట్లో పెట్టుకోగానే’’ ఆహా’’ అనిపించింది.......పప్పు మామిడికాయ.అంత పుల్లటి మామిడికాయలెక్కడ దొరికాయో వీళ్ళకి.రుచి మాములుగా లేదు........చింత చిగురూ లేత వేటమాంసం. ‘’ఓహోహో’’ అంటున్నాడు రవి......నిజమైన పప్పుచారు అంటే అదేనేమో .చిక్కగా భలేగుంది.రెసిపి కనుక్కోవాలి ఈ వంటలు చేసిన సుజాత గారిని అనుకున్నాను.చాలా ఆబగా ఎప్పుడూ తిననంత తింటా అన్నీమరిచి పోతున్నాం.’’ఇదేం రుచండి బాబూ ..దారిలో ఏ చింత చెట్టు కిందో పడకేసేయాలి’’ అంటున్నాడు రవి.
తినిలేచి బయలుదేరుతున్నప్పుడు’’మళ్ళీ ఈ చింతూరు ఎప్పుడు వద్దాం?’’ అనడిగేను విజయబాబుని.




No comments:

Post a Comment