Thursday, August 18, 2016

చొల్లంగి

కాకినాడ దాటేక జగన్నాధపురం నించి కొంత దూరమెలితే తగుల్తుంది చొల్లంగి. .దానవతల వచ్చే వంతెన కింద ఉప్పుటేరు మీద తేలతా వుంటాయి వందల పడవలు .
వాటిమీద కనిపించే ఆ జనాల జీవితాలు.. ఆ పడవల్లోనే .పురుళ్ళు,పుణ్యాలు,స్నానాలు,పానాలు,సరసాలు,సల్లాపాలు ఇలా సర్వం ఆ పడవల్లోనే .
గోదారవతల బలుసుతిప్ప ,పెదవలసలు,గాడిమోగా,మోల్లెటిమొగలాంటి గ్రామాలనుంచి వలస వచ్చిన ఆ పల్లె జనాల కాపురాలు ఆ పడవల్లోనే.ఒక విధంగా చెప్పాలంటే ఏరు మీద తేలుతున్నఒక ఊరు అది .
పడవల నిండా తాగే నీళ్ళు పట్టుకుని ,భార్యాపిల్లలతో పాటు సముద్రం వేటకి వెళ్ళేవాళ్ళు ,ఆ నీళ్ళు అయిపోయేక తిరిగొచ్చేస్తారు.ఒక్క ఒడ్డుకొచ్చిన తప్ప,సముద్రం మధ్యలో వుండగా ఎట్టి పరిస్తితుల్లోనూ సారా తాగరు. ... సముద్రం మధ్యలో చేపలే తింటారాళ్ళు.వెనకటికి సునామి వచ్చిన తరవాత జరిగిన ఒక ఇన్సిడెంటు చెప్పాడు దండుపల్లి ఈశ్వరరావు అనే వాళ్ల మనిషి .
ఆ సాయంత్రం పూట అప్పుడే పట్టిన చేప పొట్ట కోసి పేగులు తీస్తుంటే ,ఆ పేగులతోపాటు చంటిపిల్లోడి బొటనవేలు బయటికొచ్చిన్దంట......అంతే..దాంతో కొన్నాళ్ళ పాటు చేపలు ఇతవ కాలేదంటాళ్ళకి.
ఇంతకీ వాళ్ళు వేట కెళ్ళి పట్టేది చేపలు కాదు ,నత్తగుల్లలు...ఆ గుల్లని కాల్షియం,కర్పోనేట్ తయారు చేసే కంపనీ మనుషులొచ్చి కొనుక్కు పోతారంట.
‘’సముద్రంలో ప్రాణాలు తెగించి ఇంత రిస్క్ తీసుకుంటున్నారు గదా ....తుఫాన్లు ,సుడిగుండాలు లాంటివి వచినప్పుడేO
చేస్తారు ఈశ్వరరావు?’’
ఏం చేస్తావండి...భరాయిస్తావండి’’
‘’భళే చెప్పేవ్ ....రోజుకేమాత్రం గిట్టు బాటవ్వుద్దేంటి?’’
‘’ కుటుంబమంతా కష్టపడితే మా తిండికి పోను నూటయాభై మిగులుద్దండి.....అందులో సగం మా కామందుకి పోద్దండి’’
‘’అదేంటి?’’
‘’అవునండి....ఈ పడవలు కొనడానికి మా ఊళ్ళో మా కామందుల దగ్గర అప్పులు చేస్తాం గదండీ....మరి వడ్డీ కట్టక పొతే మా ఊళ్ళో మా పాకలు అయ్యి లాగేసు కోడమే గాకండా , వాళ్ల మనుషులు ఇక్కడికిదిగిపోయి , నానా అల్లరి చేస్తారండి..మాకిక్కడ బతుకుదెరువు లేకుండా జేసేస్తారండి బాబో’’అంటా కామెడీగా నవ్వేసేడా ఈశ్వరరావు.










No comments:

Post a Comment