Thursday, August 18, 2016

ముస్టాంగ్

’ముస్టాంగ్’’ అన్న పేరుగల ఈ సినిమా టర్కీ దేశానిది.......ఆ దేశంలో ఒక ముసలామె ఒక పల్లెటూళ్ళోతన ఐదుగురు మనవరాళ్లతో కలిసి వుంటుంది.
వాళ్ళలో పెద్ద మనవరాలికి పెళ్ళయ్యింది .
ఆ రోజు రాత్రి శోభనం.
లోపల గదిలో పెళ్లికూతురయిన ఆ మనవరాలితో భర్త శృంగారం చేస్తుంటే ‘’ఇంకా అవ్వలేదా?.......తొందరగా ఇవ్వండి దుప్పటి’’అంటా తలుపులు బాదుతున్నారు బయటి నుంచి .
‘’ఈ వేళప్పుడు ఏoటా అరుపులు అసలెవరాళ్ళు?’’అనుకుంటా విసుక్కుంది పెళ్లి కూతురు .
శోభనం గది బయట పెళ్లి కూతురు అత్తమామలు కొత్త దంపతులు మంచం మీద పరుచుకుని శృంగారం చేసిన ఆ దుప్పటి కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు .ఎందుకంటే ఆ తెల్ల దుప్పటి మీద ఇంద్రియం మరకలతో పాటు, పెళ్లి కూతురు కన్నెపొర చిరిగాక, యోని లోంచి వచ్చిన రక్తం మరకల్ని చూడ్డానికి .అలా రక్తం మరకలుంటే అప్పుడే కన్నెపొర చిరిగింది గాబట్టి ,ఆమె కన్య అని నిర్ణయిస్తారు ....లేకపోతే వాళ్ల రియాక్షనూ,వాళ్ళు తీసుకునే నిర్ణయమూ వేరేవిధంగా వుంటాయి .ఇదక్కడి పద్దతి ,వాళ్ల సాంప్రదాయం.
చాలా సేపటికి నలిగిన ఆ పల్చటి, తెల్ల దుప్పటి శోభనం గది లోంచి బయటికొచ్చింది .
ముసలోళ్ళు ఆత్రంగా వెతికితే ,ఆ దుప్పటి మీద ఇంకా తడారని ఇంద్రియం మరకలున్నాయిగాని,రక్తం మరక మట్టుకి మచ్చుకి ఒక్కటి కూడా లేదు .దాంతో ధారుణంగా రియక్టాయిన వాళ్ళు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు పెళ్ళికూతుర్ని .
మగ డాక్టరు రెండు కాళ్ళు విడదీసి టెస్ట్ చేస్తుంటే చాలా ఇరిటేట్ అవుతా ‘’ఇదేంటి?’’ అంది పెళ్లి కూతురు .
‘’నీ కన్నెపొర చిరిగిందో లేదో పరీక్ష చేస్తున్నాను .’’అన్నాడా డాక్టర్ .
కన్య అయిన ఆ పెళ్లి కూతురు అవమానంతో గిజగిజ లాడిపోయింది.చాలా ఫాస్ట్ గా ఊపిరి పీల్చి వదుల్తుంది.
టెస్ట్ చెయ్యడం పూర్తి చేసిన డాక్టరు ‘’కన్నెపొర ఫస్ట్ నైట్ రోజునే చిరగాలని లేదు అంతకుముందు ఏ ఆటలాడేటప్పుడో, పరిగెట్టేటప్పుడో,ధబాల్మని కింద పడ్డప్పుడో ఎప్పుడన్నా చిరగొచ్చు ,చిరక్క పోవచ్చు .కొందరికి ఫస్ట్ డెలివరీ దాకా కూడా చిరక్కండా వుంటుంది .......అన్నట్టు నీ కన్నెపొర ఇంకా చిరగ లేదు .అంటుంటే చాలా అవమానంతో కుచించుకు పోతా ఆ బల్ల మీంచి దిగింది పెళ్ళికూతురు .
‘’చూడమ్మా ...నీ కన్నెపొర చిరగాలేదన్న రహస్యం మనిద్దరి మద్యే వుండాలి తెల్సిందా?’’అని బయట తనకోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్న జనాల మద్యలోకెళ్ళేడు డాక్టరు గారు.
ఇంత నిజాయితీ పరురాలినయిన నాకు ,శీలవతినయిన నాకు ఈ పరీక్షా?కుతకుతలాడి పోయింది ,విలవిలలాడిపోయింది,గిలగిలలాడి పోయిందా పెళ్ళికూతురు .
ఇంటికెళ్ళాక మూడు సార్లు పిస్టలు పేలిన భయానకశబ్దం .విన్న నలుగురు చెల్లెళ్ళు వెళ్లి చూస్తే.......శవమై నేలమీద పడుందా పెళ్ళికూతురు .
ఇదంతా చూస్తున్న పెళ్ళికాని ఆ నలుగురు చెల్లిళ్ళని వాళ్ళక్క కధ,ఎలా కలవర పరిచిందో ....ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేసిందో మిగతా కధ చెబుతుంది .
అసలుకొస్తే అదే అసలు కధ .

                                

                                     

చొల్లంగి

కాకినాడ దాటేక జగన్నాధపురం నించి కొంత దూరమెలితే తగుల్తుంది చొల్లంగి. .దానవతల వచ్చే వంతెన కింద ఉప్పుటేరు మీద తేలతా వుంటాయి వందల పడవలు .
వాటిమీద కనిపించే ఆ జనాల జీవితాలు.. ఆ పడవల్లోనే .పురుళ్ళు,పుణ్యాలు,స్నానాలు,పానాలు,సరసాలు,సల్లాపాలు ఇలా సర్వం ఆ పడవల్లోనే .
గోదారవతల బలుసుతిప్ప ,పెదవలసలు,గాడిమోగా,మోల్లెటిమొగలాంటి గ్రామాలనుంచి వలస వచ్చిన ఆ పల్లె జనాల కాపురాలు ఆ పడవల్లోనే.ఒక విధంగా చెప్పాలంటే ఏరు మీద తేలుతున్నఒక ఊరు అది .
పడవల నిండా తాగే నీళ్ళు పట్టుకుని ,భార్యాపిల్లలతో పాటు సముద్రం వేటకి వెళ్ళేవాళ్ళు ,ఆ నీళ్ళు అయిపోయేక తిరిగొచ్చేస్తారు.ఒక్క ఒడ్డుకొచ్చిన తప్ప,సముద్రం మధ్యలో వుండగా ఎట్టి పరిస్తితుల్లోనూ సారా తాగరు. ... సముద్రం మధ్యలో చేపలే తింటారాళ్ళు.వెనకటికి సునామి వచ్చిన తరవాత జరిగిన ఒక ఇన్సిడెంటు చెప్పాడు దండుపల్లి ఈశ్వరరావు అనే వాళ్ల మనిషి .
ఆ సాయంత్రం పూట అప్పుడే పట్టిన చేప పొట్ట కోసి పేగులు తీస్తుంటే ,ఆ పేగులతోపాటు చంటిపిల్లోడి బొటనవేలు బయటికొచ్చిన్దంట......అంతే..దాంతో కొన్నాళ్ళ పాటు చేపలు ఇతవ కాలేదంటాళ్ళకి.
ఇంతకీ వాళ్ళు వేట కెళ్ళి పట్టేది చేపలు కాదు ,నత్తగుల్లలు...ఆ గుల్లని కాల్షియం,కర్పోనేట్ తయారు చేసే కంపనీ మనుషులొచ్చి కొనుక్కు పోతారంట.
‘’సముద్రంలో ప్రాణాలు తెగించి ఇంత రిస్క్ తీసుకుంటున్నారు గదా ....తుఫాన్లు ,సుడిగుండాలు లాంటివి వచినప్పుడేO
చేస్తారు ఈశ్వరరావు?’’
ఏం చేస్తావండి...భరాయిస్తావండి’’
‘’భళే చెప్పేవ్ ....రోజుకేమాత్రం గిట్టు బాటవ్వుద్దేంటి?’’
‘’ కుటుంబమంతా కష్టపడితే మా తిండికి పోను నూటయాభై మిగులుద్దండి.....అందులో సగం మా కామందుకి పోద్దండి’’
‘’అదేంటి?’’
‘’అవునండి....ఈ పడవలు కొనడానికి మా ఊళ్ళో మా కామందుల దగ్గర అప్పులు చేస్తాం గదండీ....మరి వడ్డీ కట్టక పొతే మా ఊళ్ళో మా పాకలు అయ్యి లాగేసు కోడమే గాకండా , వాళ్ల మనుషులు ఇక్కడికిదిగిపోయి , నానా అల్లరి చేస్తారండి..మాకిక్కడ బతుకుదెరువు లేకుండా జేసేస్తారండి బాబో’’అంటా కామెడీగా నవ్వేసేడా ఈశ్వరరావు.










మహలక్ష్మి సినిమా దియేటర్

ఈ రైస్ మిల్ కోనసీమలో వున్న ‘’మోరి’’ గ్రామంలో వుంది.ఒకప్పుడు దీని పేరు’’మహలక్ష్మి సినిమా దియేటర్’’.ఎన్నో సూపర్ హిట్ సినేమాలాడిన ఈ దియేటర్లో రిలీజ్ అయిన మొట్ట మొదటి సినిమా నాగేశ్వర్రావు,బి.సరోజాదేవి,క్రిష్ణ కుమారీ యాక్ట్ చేసిన ‘’పెళ్లి కానుక’’....నాగేశ్వరరావు,శ్రీదేవి,సుజాతా యాక్ట్ చేసిన ‘’ప్రేమ కానుక’’ కూడా ఈ దియేటర్లోనే ఆడింది...ఎన్టీఅర్,ఏయెన్నార్ ల చాలా సూపర్ హిట్లు ఇందులో ఆడి వెళ్లి నియ్యంట.
కాలం గడుస్తుంది..మలికిపురం,రాజోలు,తాటిపాకల్లో కొత్త దియేటర్లు కట్టడంతో ఇది పాతబడి పోయింది. జనాలు రావడం మానెయ్యడంతో మూతబడి పోయింది.చాన్నాళ్ళలాగుండి పోయేక అదే పేరుతో రైస్ మిల్ గా మారిపోయిందిప్పుడు.
అసలు దీనికంటే ముందు ఇదే ఊళ్ళో పొలాల మధ్య వున్న హాలు ‘’విజయశ్రీ టూరింగ్ టాకీస్’’.. దాని మీద మిత్రుడు గోపరాజు రాధాకృష్ణ మంచి కథ రాశారు.
గొప్పగొప్ప బ్లాకండ్ వైట్ సినిమాలు ఆ హాల్లో అడినియ్యంట.అందులో ఆడిన ఆఖరి సినేమా ‘’గులేభ కావళి కథ’’.ఆ రోజుల్లో,వంద రోజులాడిందట.ఆఖరి రోజున ఆఖరి ఆటకి మూడు దియేటర్లు పట్టే జనం ఎడ్లబళ్ళు కట్టుకునొచ్చారంట ........అలా ఆ సినేమాహాలు కథలు చాలా విని, థ్రిల్ అయిపోయిన నేను, శిధిలమయిపోయిన ఆ హాలు ఫోటో తీసుకుందామని ఆ విజయశ్రీ టూరింగ్ టాకీస్ వున్న చోటి కెళితే...........................
అది ఉన్న ప్లేస్ లో ఒక గెస్ట్ హౌస్ కట్టేసుంది.
దాన్నే చూస్తా వుండి పోయిన నా మనసు అదోలాగయి పోయింది.....కాసేపు నా మాట పడి పోయింది .






ఊరు గొడ్డుపోయింది

గోదావరి ఒడ్డున పాపికొండల వేపు వెళ్తుంటే, నాకు తెలిసిన కొన్ని గ్రామాల్లో ఈ గ్రామం కూడా ఒకటి.ఈ రేవులో సెట్ వేసి మొత్తం సినిమా ఒకటి తీశాం గతంలో. .మా దిగువ నుంచి ఈ ఎగువకి వలసొచ్చిన ఆ చేపలు పట్టే కుటుంబాల్లో కొన్ని నాకు తెలుసు.
షూటింగ్ జరిగే రోజుల్లో అప్పుడప్పుడు మంగ,శివాలు అనే ఇద్దరు ఆడాళ్ళతో పులుసులూ,ఇగుర్లు వండించే వాళ్ళం.పుల్లల పోయ్యిలమీద,మట్టి దాకల్లో వండే ఆ రుచులే వేరు.రావుడు అనే వాడు ఎప్పుడూ తాగుతూ సీమచింత చెట్టుకింద పడుకుని బొంగురు గొంతొకటేసుకుని, ఘంటసాలగారి పాటలు పాడుతుండే వాడు.మొగుడూపెళ్లాలిద్దరు ఎప్పుడూ గొడవలు పడతా వుండేవాళ్ళు.ఎప్పుడోవచ్చి ఈ ఊళ్ళో సెటిలయిన తమిళ్ కిరణాకొట్టు వాళ్ళొచ్చి పలకరించే వాళ్ళు.చెప్పుకుంటా పొతే ఇలా చాలా రకాల జనం.
ఈ ప్రాంతానికొచ్చినప్పుడల్లా ఈ ఊరొచ్చి వాళ్ళని చూసివెళ్ళేవాణ్ణి.
చాన్నాళ్ళతర్వాత రావడంతో ఓసారి పలకరించెళదామని, రేవులో పడవ దిగి, గట్టు ఫైకెక్కి, ఊళ్ళో కెళితే--------------అంతా స్మశానంలాగుంది.ఒక్క ఇల్లు లేదు ,ఒక్క మనిషి లేడు.పోలవరం ప్రాజెక్ట్ వస్తందని ఖాళీచేసిన వాళ్ళంతా,ఎక్కడెక్కడికో చెల్లా చెదురయి పోయేరంట .....ఖాళీగా వున్న ఆ ప్రదేశమంతా భోరుమని ఏడుస్తుంది.









సుజాత మెస్

పొద్దుటే మారేడుమిల్లిలో అదేదో చెత్త హోటల్లో నెయ్యిదోశ ,ఇడ్లీలు తిన్నరవి ‘’చెండాలం’’అనరిచేడు. అరవలేదుగానీ మా ఫీలింగ్ కూడా అదే.
‘’చింతూరులో మంచి భోజనం పెట్టిస్తాను పదండి’’అంటా కారుస్టార్ట్ చేశాడు విజయబాబు.
పచ్చాపచ్చని కొండల మధ్య అద్భుతమైన ఘాట్లో హాయిహాయి ప్రయాణం.దారిలో అక్కడక్కడా ఆగుతా ముందు కెళ్తుంటే... ఆ చింతూరు వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం లేని నేను అదోలాగున్నాను.అందుక్కారణం ,మా పాపికొండలు ట్రిప్ కేన్సిలవ్వడo.
ఒంటి గంటకి చింతూరు ఆ సుజాతా మెస్ లో కెళ్ళాం. ఫుడ్డింకా రెడీ అవ్వలేదంట ’’ఇక్కడెలాగుంటదో’’అనుకుంటున్నారవి, చిరాగ్గా అక్కడి బల్ల మీద చతికిల బడితే అతన్నిజేర్చినేనూ కూలబడ్డాను.బయట నిలబడి ఫోను మాటాడు కుoటున్నాడు విజయ్. కరెంట్లేకపోడంతో ఒకటే చెమట్లు,చొక్కాలు తడిసిపోతున్నాయి.మనసంతా చిరాగ్గా అదేదోలాగుంది.లేచెల్లిపోదాం అనుకుంటుండగా’’సార్ భోజనం రడీ అండి’’ అన్న ఆడగొంతు వినిపించింది,ఫ్యాన్లు కూడా తిరగడం మొదలెట్టినియ్యి.
వేడిఅన్నంలో చిన్నచిన్న ఉల్లిపాయ ముక్కలు కలిసిన గోంగూర పచ్చడి .ముద్ద నోట్లో పెట్టుకోగానే’’ ఆహా’’ అనిపించింది.......పప్పు మామిడికాయ.అంత పుల్లటి మామిడికాయలెక్కడ దొరికాయో వీళ్ళకి.రుచి మాములుగా లేదు........చింత చిగురూ లేత వేటమాంసం. ‘’ఓహోహో’’ అంటున్నాడు రవి......నిజమైన పప్పుచారు అంటే అదేనేమో .చిక్కగా భలేగుంది.రెసిపి కనుక్కోవాలి ఈ వంటలు చేసిన సుజాత గారిని అనుకున్నాను.చాలా ఆబగా ఎప్పుడూ తిననంత తింటా అన్నీమరిచి పోతున్నాం.’’ఇదేం రుచండి బాబూ ..దారిలో ఏ చింత చెట్టు కిందో పడకేసేయాలి’’ అంటున్నాడు రవి.
తినిలేచి బయలుదేరుతున్నప్పుడు’’మళ్ళీ ఈ చింతూరు ఎప్పుడు వద్దాం?’’ అనడిగేను విజయబాబుని.




విపశ్యన ధ్యాన కేంద్రము

విపశ్యన ధ్యాన కేంద్రము (మే 31 )

మనం ఆలోచించడం,రాయడం లాంటివి చెయ్యకండా ,మనదగ్గర కాయితం,పెన్నూ,చదివే పుస్తకాలూ వుంటే తీసేసుకుంటారు.సెల్ ఫోనయితే ముందే తీసేసుకుంటారు.
లోపలి కెల్లడానికి ముందు ఆ గేటు బయట మూసుకున్నపెదవులు సరిగ్గా పది రోజుల తరువాత మళ్లీ అదే గేటు బయట కొచ్చేదాకా తెరవ కూడదు.
తెల్లవారుఝాము నాలుగు గంటలకి లేవాలి ,రోజుకిపది గంటలుధ్యానం,సాత్వికాహారం
ఈ ప్రపంచంతో ఏ సంబంధాలూ ఉండకూడదీ పది రోజులూ........
ఇవీ విపాస్స్యన ధ్యాన కేంద్రం గురించి బయటి వాళ్ళు చెపితే నేను విన్నకొన్నిపొడిమాటలు. మహోన్నతమూ,మహాద్బుతమూ,
ఐన ఆ నిశ్శబ్దాన్నిఅనుభవించడానికి
రేపు తెల్లవారుజామున వెళ్తున్నాను. ఆ లోపలికి......నమస్కారం






కళ్ళు మూసుకుని ఆ ద్యానం లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను.. చిక్కటి దుమ్ముపట్టేసినఅద్దం లాంటి నా మనసులో సీతాకోకచిలకల్లా అటుఇటు కదుల్తున్న జ్ఞాపకాలు,రంగురంగుల కొత్తకోరికలు,చిరాకుపెట్టే మిత్రులు,అందమయిన శత్రువులు ................నిరంతరమైన ట్రాఫిక్,సిగ్నల్ పోల్స్ కనిపించని దారుణమయిన ట్రాఫిక్... ..మస్తిష్కంలో ఇలాగే జరుగుతుందని ‘’మెడిటేషన్’’ అన్న లెక్చర్లో ఓషో అన్నమాటలు గుర్తొస్తున్నాయి.
ఊపిరాడ్డం లేదు
ఒకటే చిరాకు
కళ్ళుతెరిచి కురుస్తున్నఆ వర్షంలోపారిపోదాం అన్న ఆలోచన.
కెరటాల అలజడి,హోరూ కేవలం సముద్రంఒడ్డున మాత్రమే..వాటిని దాటి ఆ సముద్రం మధ్యలోకెళ్తే అంతమనోహరమైన ప్రశాంతత ఇంకే జన్మకీ దొరకదు.అన్నభగవాన్ శ్రీ రమణమహర్షి మాటలు గుర్తొచ్చాయి.
ఈ బల్యారిష్టాల్ని దాటుకుంటా ముందుకి మరీ ముందుకెళ్తే జన్మధన్యమే కదా?అనుకుంటా...ఆ ప్రయత్నమే చేయడం మొదలెట్టాను.ఏమవుతుందో చూద్దాం......... (జూన్  12)

                      



నాగార్జునసాగర్ రోడ్లో వున్న’’విపస్యన’’ ద్యాన కేంద్రంలో పది రోజులుండి బయటి కొచ్చిన నన్ను తీసుకెళ్ళడానికి మిత్రులు చక్రవర్తిగారొచ్చారు.తోటల్లో రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి బయటికొచ్చాక సాగర్ రోడ్ వచ్చింది ..’’సిటీలోకొద్దు నాగార్జునసాగర్ వెళ్దాం’’ ఆన్నాను.
ఆకాశమంతా మబ్బులు పట్టి వుంది .చలి గాలులు వీస్తున్నాయి..ఈ పదిరోజులూ ద్యానంలో వున్ననా మనసు అదోలాగుంది ,అదోరకo మూడ్ క్రియేటవుతుంది..
‘’విపశ్యన అంటే ఏంటoడి?’’అడిగేడు చక్రవర్తిగారు.
‘’ఉన్నది ఉన్నట్టుగా చూడ్డం’’సమాధానం చెపుతా నేచర్నే చూస్తున్న నాకు చూస్తున్నప్రతీదీ అద్భుతంగా కనిపిస్తుంది.అదే మూడ్ లో సాగర్ ఘాట్ లోకి ఎంటరయ్యి,బ్రిడ్జి మీదకొచ్చాo.నారింజ రసం అమ్మేబళ్లవాళ్ళు రమ్మని పిలుస్తున్నారు.మౌలాబి అనే అమ్మాయి బండిలో రసం తాగి ,డేమ్ వేపెళ్తుంటే ‘’సాగర్లో నీళ్ళు లేవు చూడండి... అంతా ఎండి పోయింది.రేపు వర్షాలు వస్తే చాలా బాగుంటుంది తెల్సా’’అంటున్నాడు చక్రవర్తిగారు.
అప్పుడేమో....ఉన్నదున్నట్టుగా చూస్తున్న ప్రతీదీ బాగుందిప్పుడు.
‘’వర్షాలకి బాగానీళ్ళు వచ్చేకా....యీ సాగర్నుంచి శ్రీశైలం బోట్ జర్నీ....అబ్బో..... మీరయితే భళే ఎంజాయ్ చేస్తారు’’
అప్పుడేమో....నాకిప్పుడే చాలా ఆహ్లాదకరంగా ఉంది....ప్రతీదీ అందంగా ఉంది..అసలు అందం కనిపించే దాంట్లో కాడు.ఎవరో అన్నట్టు చూసే మన కళ్ళల్లో వుండాలి.....ఇది కూడా విపస్యనేనా......? కాసేపు ఆలోచించిన నేను,చక్రవర్తి గారి కేసి చూశాను ఏదో పాడుకుంటున్నాడు....... ‘’నీ అందమే అరుదైనది,నా కోసమె నీవున్నది.వెన్నెల ఎండ కాసింది,కన్నుల కాటుక కరిగింది..........(జూన్ 16 )


                   







Monday, July 25, 2016

టార్కవస్కీ

"నా బాల్యం ఏమాత్రం గొప్పది కాదు .ఐనా ఆ బాల్యమంటే నాకు ఇష్టం.కలల చుట్టూ కలతిరగడం తోనే జీవితం గడిచి పోయింది.ఆ కలలంటే నాకు ప్రాణం .ఆకుపచ్చని జ్ఞాపకాల వరండా మెట్లమీదే నిలబడి ఉంటానెప్పుడూ.జ్ఞాపకాలే నా జీవితం మరి." అంటారు టార్కవస్కీ.
అయన జీవితకాలంలో తీసినవి ఏడేఏడు సినిమాలు. ఆ ఏడింటిలోనూ పైన చెప్పిన అంశాలు పుష్కలంగా వున్నాయి.అందుకేనేమో ఆయనంటే నాకు వల్లమాలినిష్టం.
ఎక్కువగా బాల్యానికి సంబందించిన కథలు ..మిగతా సినిమాల కంటే చాలా భిన్నగా వ్యత్యాసంగా వుండే స్క్రీన్ ప్లే, వివరించలేనంత గొప్ప ఫోటోగ్రఫీతో పాటు మహాద్భుతమైన నడక.
సాహితీకారులు వాడ్రేవు  చినవీరభద్రుడు గారు'' ది మిర్రర్'' సినిమా అంతకుముందు
రోజు రాత్రి చూసారంట ''ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప సినిమా చూళ్ళేదు.
.ప్రతి ఫ్రేమూ ఒక పెయింటింగే...జీవితం చూస్తున్నట్టుంది'' అంటా చాలా గొప్పగా పొగిడారా అద్భుత రష్యన్ చలన చిత్రకారుడైన ఆ టార్కవస్కీని.